ఏపీ సీఎం జగన్ ను కలిసిన పీవీ సింధు

238
Pv Sindhu Cm Jagan

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి అమరావతి సచివాలయానికి వచ్చిన సింధు ముఖ్యమంత్రిని కలిసింది. ఛాంపియన్ గా గెలిచిన తర్వాత ఆమె తొలిసారిగా సీఎం జగన్ ను కలిసింది. ఈ సందర్భంగా వరల్డ్ ఛాంపియన్ షిప్ సాధించిన సింధును శాలువా కప్పి జగన్ సత్కరించారు. ఆమెకు అభినందనలను తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.

Pv Sindhu Family meet Cm jagan

తనకు దక్కిన బంగారు పతకాన్ని సీఎం జగన్‌కు చూపిస్తూ ఆనందపడింది సింధు. అనంతరం ఒక బ్యాడ్మింటన్ బ్యాటును సీఎంకు బహుకరించారు. కాగా, అంతకుముందు.. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న పీవీ సింధుకు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు, పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ప్రవీణ్ కుమార్, స్పోర్ట్స్ ఎండీ భాస్కర్ ఘన స్వాగతం పలికారు.

సీఎంతో సమావేశం అనంతరం సింధు మీడియాతో మాట్లాడుతూ.. వైజాగ్ లో అకాడమీ నెలకొల్పేందుకు ఐదు ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని తెలిపింది. అన్ని రకాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడించింది. పద్మభూషణ్ పురస్కారానికి తన పేరును పరిశీలిస్తుండటం గర్వంగా ఉందని తెలిపింది.