సాహోరే రాజమౌళి మామా..!

171
Baahubali 2: Celebs reactions
- Advertisement -

అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. బాహుబలి ఫస్ట్ పార్ట్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన జక్కన్న రెండో పార్ట్‌తో తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ఖండంతారాలకు వ్యాపింపచేశాడు. సినిమాను చూసేందుకు సెలబ్రిటీల దగ్గరి నుంచి సామాన్యుల వరకు అంతా క్యూ కడుతున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు ఇవాళ బాహుబలి2ని వీక్షించి అభినందనలు తెలియజేశారు. ఎన్టీఆర్‌, నాని, అఖిల్‌ అక్కినేని, నిఖిల్‌,కళ్యాణ్ రామ్, మంచు లక్ష్మీ  బాహుబలి టీంకు అభినందనలు తెలియజేశారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన జక్కన్నను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

సినిమా యూనిట్‌ని అభినందించిన ఎన్టీఆర్… బాహుబలి 2 ఓ అత్యుత్తమ దృశ్య కావ్యం అని ట్వీట్ చేశారు.  ఎన్టీఆర్ సోదరుడు కల్యాణ్ రామ్ సైతం ‘బాహుబలి-2’పై ప్రశంసలు గుప్పించారు. ‘ఇక ఇప్పుడు తెలుసుకోవాల్సింది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని కాదు… అసలు ‘బాహుబలి-2’ని ఇంత గొప్పగా రాజమౌళి ఎలా తెరకెక్కించారో తెలుసుకోవాలి’ అని కల్యాణ్ రామ్ ట్వీట్స్ చేశారు.

ఇక ఈ సినిమాని చూసిన న‌టి, నిర్మాత‌ మంచు లక్ష్మి ఎంతో సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ.. త‌న గ్యాంగ్‌తో క‌లిసి మొద‌టి రోజు మొద‌టి ఆట బాహుబ‌లి-2 చూశాన‌ని చెప్పి, ట్విట్ట‌ర్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. అందులో అడవి శేషు, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా, సుశాంత్ తదితరులు ఉన్నారు.

‘ప్రపంచ వ్యాప్త మేనియా మొదలైంది: బాహుబలి: ది క‌న్‌క్లూజ‌న్‌’ – కరణ్‌ జోహార్‌

‘నువ్వు మా పక్కన ఉన్నంతవరకు తెలుగు సినిమా గురించి మాట్లాడే మగాడు ఇంకా పుట్టలేదు రాజమౌళి మామా. బాహుబలి ఒక సినిమా కాదు ఇదో పండగ. థాంక్యూ బాహుబలి టీం, మమ్మల్ని గర్వపడేలా చేశారు’ -నాని

‘ఇప్పుడే బాహుబలి 2 చూశాను. నోట మాట రావట్లేదు. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. బాహుబలి టీంకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పనవసరం లేదు’ – అఖిల్‌ అక్కినేని

‘బాహుబలి2.. భారత సినీరంగంలో ఓ అద్భుత కాన్వాస్‌. ఈ చిత్రంతో ఒక్క తెలుగు సినిమానే కాదు, భారతీయ చిత్రాలను కూడా ఓ కొత్త స్థాయికి తీసుకెళ్లారు. హ్యాట్సాఫ్‌ రాజమౌళి. ప్రభాస్‌, రానా, అనుష్క, రమ్యకృష్ణ నటన అమోఘం’ – ఎన్టీఆర్‌

‘ఓ మనిషి సృజనాత్మకత, 500 మంది టెక్నీషియన్ల కష్టం. ఆరేళ్ల పట్టుదల.. ఇదంతా కలిస్తే ఓ మిరాకిల్‌. అదే బాహుబలి’ – సాయి ధరమ్‌ తేజ్‌
‘బాహుబలి2 సినిమా చూశా. అంచనాలను మించిన బాహుబలి. రాజమౌళికి శిరస్సు వంచాల్సిందే’ – నిఖిల్‌

- Advertisement -