డీఎంకేలో కుర్చి “పోరు”

267
dmk
- Advertisement -

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం. కరుణానిధి మరణించిన కొన్నాళ్లకే పార్టీ బాధ్యతల కోసం అన్నదమ్ముల మధ్య పోరు మొదలైంది. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న ఎంకే స్టాలిన్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. నాలుగేళ్ల క్రితం పార్టీ నుంచి తొలగించబడిన కరుణానిధి పెద్ద కుమారుడు ఆళగిరి సైతం.. తాను కూడా అధ్యక్ష పదవికి అర్హుడేనని ప్రకటించుకుంటున్నారు. ఇవాళ కరుణానిధి సమాధి దగ్గర నివాళులు అర్పించిన అళగిరి.. తన తండ్రి నిజమైన అనుచరులు, కార్యకర్తలంతా తనకే మద్దతిస్తున్నారని ప్రకటించారు.

dmk

రేపు జరగనున్న పార్టీ కీలక సమావేశానికి ముందు అళగిరి ప్రకటన డీఎంకెలో కలకలం రేపుతోంది. దేనికైనా కాలమే సమాధానం చెబుతుందని, పార్టీలో కీలక పాత్ర పోషించాలని తనను తమిళ ప్రజలు ప్రోత్సహిస్తున్నారని తెలిపారు అళగిరి. తప్పకుండా తాను విజయం సాధిస్తాననే నమ్మకం ఉందన్నారు ఆళగిరి. అయితే డీఎంకేలో కుటుంబ తగాదాలకు చోటివ్వకుండా ఉండేందుకు పలువురు సీనియర్లు రంగంలోకి దిగారు. ఆళగిరిని బుజ్జగించే పనిలో పడ్డారు సీనియర్ నేతలు. కరుణానిధి చాలా కాలం క్రితమే తన చిన్న కొడుకు ఎం.కె. స్టాలిన్ ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు.

dmk

స్టాలిన్ ప్రస్తుతం డీఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. యుపిఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అళగిరిని 2014లో కరుణ పార్టీ నుంచి బహిష్కరించారు. బహిష్కరణకు ముందు ఇద్దరు అన్నదమ్ముల మధ్య నాయకత్వ బాధ్యతల కోసం ఘర్షణ తారస్థాయికి చేరింది. ఇప్పుడు అళగిరి తిరుగుబాటు పోకడలు చూస్తుంటే స్టాలిన్ కి కష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రేపు డీఎంకే కీలక సమావేశానికి ముందు అళగిరి ప్రకటనను పార్టీలో అధికారం కోసం జరగబోయే పోరాటానికి సూచనగా భావిస్తున్నారు.

- Advertisement -