ఏపీలో రేషన్ డీలర్లకు మంగళం..!

274
jagan conference

పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న ఏపీ సీఎం జగన్‌ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. ప్రజాపంపిణీ వ్యవస్థలో కీలకంగా ఉన్న రేషన్ డీలర్లకు ఇకపై స్వస్తీ చెప్పనున్నట్లు తెలుస్తోంది. అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువస్తున్న జగన్‌ ఇకపై నేరుగా వారి ద్వారానే లబ్దిదారుల ఇంటికి ప్రజా పంపిణి సరుకులు అందజేయాలని భావిస్తున్నారు.

అమరావతి వేదికగా జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో జగన్‌ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇక, ప్రభుత్వ అందజేసే రేషన్‌ను నేరుగా లబ్దిదారులకు గ్రామ వలంటీర్లే అందజేయనున్నారని సీఎం ప్రకటించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇకపై రేషన్‌ డీలర్లు ఉండబోరని వెల్లడించారు.

తెల్ల రేషన్ కార్డుదారులకు సెప్టెంబరు 1 నుంచి సన్న బియ్యాన్నే పంపిణీ చేయాలని అధికారులకు నిర్దేశించారు. తినగలిగే బియ్యాన్ని, అదీ ప్యాకింగ్ రూపంలో ఇచ్చే ప్రక్రియ రెండు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. ప్యాకింగ్‌ యూనిట్లు, నిల్వ కేంద్రాల ఏర్పాటు కొలిక్కి వచ్చిన జిల్లాల్లో తొలి విడతలో, మిగితా చోట్ల రెండో విడతలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.

లబ్ధిదారుల ఇంటికి తీసుకువెళ్లి వారి బయోమెట్రిక్‌ పరికరంపై ధ్రువీకరణ తీసుకున్నాకే సరకుల్ని అందజేస్తారు. లబ్ధిదారుడి వేలిముద్ర సరిగా పడకపోతే వారి ఆధార్‌ నెంబరు ఆధారంగా సరకులను ఇవ్వనున్నారు. ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ వద్ద అందుబాటులో ఉన్న బియ్యంలోనే నాణ్యమైన రకాన్ని వేరుచేసి, తొలి విడత జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. మొత్తంగా జగన్‌ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.