హేమ సంచలనం..!

228
hema

హాస్యనటి శ్రీలక్ష్మీ తరువాత లేడీ కమెడియన్‌గా మళ్లీ అంతటి పేరుతెచ్చుకున్న నటీ హేమ. వైవిధ్యమైన పాత్రలు,అంతకుమించి ముక్కుసూటి తనంతో ఎప్పుడు వార్తల్లో నిలిచే హేమ తాజాగా సంచలన ప్రకటన చేసింది. త్వరలో తాను పూర్తిస్ధాయి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు.

2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఇక వైసీపీ అధికారంలోకి రావడంతో పూర్తిస్ధాయి రాజకీయాలపై దృష్టిసారిస్తానని తెలిపింది హేమ.

హైదరాబాద్ సినీ పరిశ్రమను వీడి ఒక అడుగు ముందుకేసి బాహ్య ప్రపంచంలోకి వస్తున్నానని తెలిపారు. కాపుల కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి రెండు వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించటం అభినందనీయమని..కేంద్రం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.

2014 ఎన్నికల్లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్ధాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీచేసిన హేమ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ సినీ కెరీర్‌పై దృష్టి సారించారు. తాజాగా పూర్తిస్ధాయి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు.