ట్రైనీ పోలీసులపై ఉగ్రదాడి…60 మంది మృతి

183
online news portal
- Advertisement -

పాకిస్థాన్‌లోని క్వెట్టాలో గల పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ట్రైనింగ్ సెంటర్ వాచ్‌టవర్‌ను మొదటగా ధ్వంసంచేసిన ముగ్గురు ఉగ్రవాదులు సుసైడ్ జాకెట్లతో సెంటర్‌లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 60 మంది పోలీసులు మృతిచెందగా 100 మందికి పైగా గాయాలయ్యాయి. అదేవిధంగా 600 మంది పోలీసులను బందీలుగా చేసుకున్నారు.

ముష్కరులు పోలీసు దుస్తులు, ముఖానికి మాస్కులు ధరించి అకాడమీలోకి ప్రవేశించినట్లు పాక్‌ మీడియా తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ప్రధాన ద్వారం వద్ద సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు.. వసతి గృహంలోకి చొరబడ్డారు. అనంతరం విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అకాడమీ అధికారులు.. పాకిస్థాన్‌ ఆర్మీ, ప్రత్యేక భద్రతా దళాలకు సమాచారమందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులకు దిగారు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన భీకర పోరులో ఇద్దరు ఉగ్రవాదులు తమను తాము పేల్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో ఉగ్రవాది మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

aptopix-pakistan

దాడి ఎవరు జరిపారన్న విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే పాకిస్థాన్‌ తాలీబన్‌ అనుబంధ సంస్థ లష్కరే జాంగ్వీ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడి ఉంటుందని మిలిటరీ కమాండర్‌ జెనరల్‌ షేర్‌ ఆఫ్గాన్‌ అనుమానం వ్యక్తం చేశారు. క్వెట్టాలో ఇలాంటి భీకర ఉగ్రదాడి జరగడం రెండు నెలల్లో ఇది రెండో సారి. ఈ ఏడాది ఆగస్టులో తెహ్రీక్‌ ఏ తాలిబన్‌ ఉగ్రవాదులు క్వెట్టాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో దాడులు జరిపిన విషయం తెలిసిందే. న్యాయవాదులను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడుల్లో 73 మంది ప్రాణాలు కోల్పోయారు.

pak

- Advertisement -