గత ఐదేళ్ల కాలంలో సింగరేణి 322% వృద్ధి..

402
singareni
- Advertisement -

సింగరేణి సంస్థ 2018-19 ఆర్ధిక సంవత్సరంలో 1,766 కోట్ల రూపాయల నికర లాభాలను ఆర్జించినట్లు శుక్రవారం (జూలై 26వ తేదీ) నాడు హైద్రాబాద్ సింగరేణి భవన్‌లో జరిగిన 550వ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ప్రకటించారు. సమావేశానికి సింగరేణి సి ఎం.డి. ఎన్.శ్రీధర్ అధ్యక్షత వహించారు.

గత ఏడాది కన్నా లాభాల్లో 50 శాతం వృద్ధి సాధించడంపై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం హర్షం ప్రకటించింది. సంస్థ రధసారథి సి ఎం.డి. శ్రీ ఎన్.శ్రీధర్‌ను అభినందిస్తూ తీర్మానం చేసింది. సింగరేణి సంస్థ గత ఏడాది రికార్డు స్థాయిలో 644 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని, 677 లక్షల టన్నుల బొగ్గు రవాణాను సాధించి 25,828 కోట్ల రూపాయల అమ్మకాలను జరిపింది. ఈ నేపథ్యంలో కంపెనీ 1,766 కోట్ల రూపాయల నికర లాభాలను ఆర్జించగలిగింది. ఇది గత ఆర్ధిక సంవత్సరం (2017-18) సాధించిన 1,177 కోట్ల రూపాయల నికర లాభంపై 50 శాతం అధికం.

సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్ర అవిర్భావం తర్వాత బొగ్గు ఉత్పత్తి, రవాణా, అమ్మకాలు, లాభాల్లో అద్భుతమైన రీతిలో పురోగమిస్తోంది. తెలంగాణా రాకముందు సంవత్సరం అనగా 2013-14లో 418.74 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిన కంపెనీ గడచిన ఐదేళ్ల కాలంలో అద్భుతమైన వృద్ధి రేటుతో 2018-19 నాటికి 1,766 కోట్ల రూపాయల నికర లాభాలను ఆర్జించే స్థాయికి ఎదిగింది.అంటే 322 శాతం వృద్ధిని సాధించిందన్నమాట. ఇంత వృద్ధిని దేశంలోని ఏ ప్రభుత్వ సంస్థలు, మహారత్న కంపెనీలు కూడా గత ఐదేళ్లలో సాధించి ఉండలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిశానిర్దేశం, సి అండ్‌ ఎం.డి. ఎన్.శ్రీధర్ తీసుకొన్న చర్యలు, చేపట్టిన సంస్కరణలు, రోజువారీ సమీక్షల ఫలితంగా ఈ అనూహ్య విజయం సాధ్యమైంది.

నిఖర లాభాలను సింగరేణి బోర్డు ఆమోదించిన నేపథ్యంలో కార్మికులకు చెల్లించే లాభాల వాటాపై త్వరలోనే తాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను కలిసి నివేదించనున్నానని, త్వరలోనే లాభాల బోనస్ అందుకునేలా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తానని సి&ఎం.డి. శ్రీ ఎన్.శ్రీధర్ తెలిపారు. సంస్థ అభివృద్ధికి అడుగడుగున సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా తన ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే సమిష్టి కృషితో ముందుకు సాగుతున్న కార్మిక సంఘాల నాయకులకు, అధికారులకు, కార్మికులకు, సూపర్వైజరీ సిబ్బందికీ తన అభినందనలు తెలియజేశారు.

బోర్డు సమావేశంలో కొత్త గనులకు, ఓ.బి. పనులకు అనుమతులు మొదలైన విషయాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశానికి సి ఎం.డి. ఎన్.శ్రీథర్ అధ్యక్షత వహించగా తెలంగాణా రాష్ట్ర ఇంథన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణరావు, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ పి.ఎస్.ఎల్.స్వామి, డైరెక్టర్ శ్రీ ముఖేష్ చౌదరి, సింగరేణి నుండి సంస్థ డైరెక్టర్లు ఎస్.శంకర్ (డైరెక్టర్ ఇ&ఎం), ఎస్.చంద్రశేఖర్ (డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా), బి.బాస్కరరావు (డైరెక్టర్ పి&పి), ఎన్.బలరాం (డైరెక్టర్ ఫైనాన్స్), కంపెనీ కార్యదర్శి జి.శ్రీనివాస్ లు బోర్డు సామావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -