రివ్యూ:ఇంకొక్కడు

656
inkokkadu review
inkokkadu review
- Advertisement -

అప‌రిచితుడు, ఐ లాంటి ప్రయోగాత్మక సినిమాలతో తనకంటూ ఒక వైవిధ్యతను ఏర్పర్చుకున్న హీరో విక్రమ్.. తాజాగా ఇరుమురుగ‌న్ (తెలుగులో ఇంకొక్క‌డు )తో మళ్లీ వెండితెరపై సందడి చేస్తున్నాడు. అరిమానంబీ (తెలుగులో డైన‌మైట్‌) ఫేం ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఇంకొక్క‌డు సినిమా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. తెలుగులో ఇంకొక్కడుగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో  చూద్దాం..

కథ :

Stills

మలేషియాలోని ఇండియన్ ఎంబసీ మీద ఓ 70 ఏళ్ల వృద్ధుడు దాడి చేసి 20 మంది భారతీయ పోలీసుల్ని చంపటంతో సినిమా మొదలవుతోంది. లవ్ (విక్రమ్) అనే సైంటిస్ట్ కనిపెట్టిన‘స్పీడ్’డ్రగ్‌ వల్లనే ఈ దాడి జరిగిందని పోలీసులు తెలుసుకుంటారు. లవ్ రూపొందించిన స్పీడ్ డ్రగ్ తీసుకుంటే 5 నిమిషాల పాటు మనిషికి అద్వితీయ మైన శక్తి వస్తుంది. ఆ డ్రగ్‌ను తన అవసరాలకు, చెడు మార్గంలో వాడుకోవాలని ప్రయత్నిస్తాడు లవ్‌. అప్రమత్తం అయిన భారత ప్రభుత్వం ఇప్పటికే లవ్‌ కేసు డీల్ చేసిన అనుభవం ఉన్న రా ఆఫీసర్ అఖిలన్ వినోద్(విక్రమ్)కు ఈ కేసు బాధ్యతలను అప్పగిస్తారు. మరో రా ఆఫీసర్ ఆరుషి(నిత్యామీనన్)తో కలిసి మలేషియాలో అడుగుపెట్టిన అఖిల్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అసలు అఖిల్‌కి, లవ్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో మీరా (నయనతార) ఎవరు? లవ్ కనిపెట్టిన స్పీడ్ అనే డ్రగ్ కథేంటీ? చివరకు లవ్ కథను ఎలా ముగించాడు అన్నదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

inkokkadu

ఈ సినిమాకి ప్రధానమైన బలం విక్రమ్ అని చెప్పొచ్చు. జాతీయ స్థాయి నటుడిగా ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ చేసుకున్న విక్రమ్ ఈ సినిమాతో మరోసారి తనలోని నటుణ్ని అద్భుతంగా తెర మీద ఆవిష్కరించాడు. అఖిల్, లవ్ అనే రెండు విభిన్న పాత్రల్లో విక్రమ్ తన నటన స్థాయిని కొత్తగా మళ్ళీ పరిచయం చేశాడు. సిన్సియర్ రా ఆఫీసర్గా కనిపిస్తూనే గే లక్షణాలున్న క్రూయల్ సైంటిస్ట్, లవ్ పాత్రలోనూ ఆకట్టుకున్నాడు. రెండు పాత్రల మధ్య మంచి వేరియేషన్స్ చూపించిన విక్రమ్ నటుడిగా తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. రా ఆఫీసర్లుగా నయనతార, నిత్యామీనన్లు ఆకట్టుకున్నారు. అఖిల్, లవ్ పాత్రల మధ్యన సెకండాఫ్‌లో వచ్చే మైండ్ గేం కొన్ని చోట్ల ఆకట్టుకుంది. నాజర్, తంబి రామయ్య లాంటి నటులు తమ పరిథి మేరకు అలరించారు

 

మైనస్ పాయింట్స్ :
సినిమా వ్యవది ఎక్కువ ఉండడం.. విషయాన్ని సాగదీయడం.. కామెడీ లేకపోవడం.. ప్రధాన మైనస్ పాయింట్లుగా చెప్పచ్చు. ఇక సెకండాఫ్‌లో హీరో, విలన్ ఒకసారి ఎదురుపడ్డాక సినిమా అంతా ఒకే ఒక్క అంశం చుట్టూ సాగేది కావడం బోర్ కొట్టించింది. దానికి తోడు ఇదే సమయంలో రెండు పాటలు రావడం కూడా కాస్త విసుగు తెప్పించింది. ఫస్టాఫ్‌లో విక్రమ్, నయనతారల మధ్యన వచ్చే లవ్‌ట్రాక్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. సైన్స్ ఫిక్షన్ విషయంలో లాజిక్ పక్కనబెడితే, మిగతా చాలా విషయాల్లోనూ లాజిక్ అన్నదాన్ని పట్టించుకున్నట్లు కనిపించలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే దర్శకుడు ఆనంద్ శంకర్ ఒక కొత్త కాన్సెప్ట్‌నే అందరికీ తెలిసిన, కమర్షియల్ సినిమా ఫార్మాట్‌లో చెప్పే ప్రయత్నం చేశాడు. విక్రమ్, నయనతార, నిత్యామీనన్ లాంటి నటీనటులను ఒప్పించిన దర్శకుడు అందుకు తగ్గ స్థాయి కథా కథనాలను సిద్ధం చేయలేకపోయాడు. యాక్షన్ సీన్స్, ట్విస్ట్లు అలరించినా.. కొన్ని సన్నివేశాలు ఏ మాత్రం లాజిక్ లేనట్టుగా అనిపిస్తాయి. విక్రమ్ లుక్స్, విలన్ క్యారేక్టరైజేషన్ లాంటి అంశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. హారిస్ జయరాజ్ సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేదు. అయితే హరీస్ జైరాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి బలంగా నిలిచింది. అయితే పాటల్లో హెలెనా తప్ప వెంటనే ఆకట్టుకునేలా పాటలేవీ లేవు. ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. భువన్ శ్రీనివాసన్ ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. లవ్ పాత్రకు కాస్యూమ్స్ పరంగా, మేకప్ పరంగా తీసుకున్న జాగ్రత్తలను అభినందించాల్సిందే!

తీర్పు :

తనకు బాగా అలవాటైన ఈ పద్ధతినే నమ్ముకొని విక్రమ్ ఈ సారి కూడా ప్రయోగాన్నే నమ్ముకొని వచ్చారు. అయితే ఆ ప్రయోగం పూర్తి స్థాయి సినిమాగా ఆకట్టుకునేలా లేకపోవడమే ఇక్కడ మైనస్. విక్రమ్ అనితర సాధ్యమైన నటన, ఫస్టాఫ్‌లో డ్రగ్‌ను, హీరో, విలన్‌ పాత్రలను పరిచయం చేసిన విధానం, ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండాఫ్‌లో హీరో, విలన్‌ల మైండ్ గేమ్ ఇలా సన్నివేశాలుగా చూస్తే ఇంకొక్కడులో కట్టిపడేసే అంశాలు చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ సరిగ్గా అల్లడంలో పాత కథను ఎంచుకోవడం, దాన్ని కూడా పూర్తి స్థాయిలో బాగుండేలా చెప్పలేకపోవడం నిరాశ పరచే అంశం. ఓవరాల్గా ఇంకొక్కడు, నటుడిగా విక్రమ్ స్థాయిని మరో మెట్టు ఎక్కించినా, తన స్థాయికి తగ్గ కమర్షియల్ సక్సెస్ మాత్రం అందించకపోవచ్చు.

విడుదల తేదీ : సెప్టెంబర్ 8, 2016
రేటింగ్ : 2.5/5
నటీనటులు : విక్రమ్, నయనతార, నిత్యా మీనన్..
నిర్మాత : శిబు థమీన్స్
సంగీతం : హరీస్ జైరాజ్
దర్శకత్వం : ఆనంద్ శంకర్

- Advertisement -