మిషన్ భగీరథ తో తెలంగాణ దేశానికే స్ఫూర్తిః మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు

253
Mission Bhagirada Maharsta Officers
- Advertisement -

మిషన్ భగీరథ తో తాగునీటి కొరతను అధిగమించి దేశానికి తెలంగాణ స్ఫూర్తిగా నిలిచిందన్నారు మహారాష్ట్ర తాగునీటి, పారిశుద్ధ్య విభాగం అడిషనల్ సెక్రెటరీ శ్యామ్ లాల్. తక్కువ సమయం లో అత్యంత నాణ్యతతో భగీరథ ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం గొప్ప విషయం అన్నారు. వికారాబాద్ జిల్లా రాఘవాపూర్ దగ్గర నిర్మించిన 135 MLD నీటి శుద్ది కేంద్రాన్ని శ్యామ్ లాల్ నేతృత్వంలో వచ్చిన మహారాష్ట్ర తాగునీటి విభాగం ఇంజనీర్లు సందర్శించారు. ట్రీట్ మెంట్ ప్లాంట్ లోని విభాగాలను పరిశీలించారు.

చిన్న లీకేజీ కూడా లేకుండా ప్లాంట్ ను మంచిగా నిర్వహిస్తున్నారని మహారాష్ట్ర బృందం ప్రశంసించింది. పనులు చేసిన తీరును తెలుసుకున్నారు. 365 రోజులు తాగునీరు అందుబాటులో ఉండే విధంగా ప్రాజెక్ట్ ను డిజైన్ చేసిన తీరును తెలుసుకున్నారు. ఆ తరువాత పరిగి మండలం సొందా పూర్ తండాలో మహారాష్ట్ర బృందం పర్యటించింది. ఇంటింటికి నల్లా నీళ్లు సరఫరా అవుతున్న తీరును గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.

ఆ తరువాత మాట్లాడిన శ్యామ్ లాల్, విదర్భ తాగునీటి సమస్యను తీర్చేందుకు తమ ప్రభుత్వం మిషన్ భగీరథ లాంటి పథకాన్ని త్వరలోనే మొదలు పెడుతుందన్నారు. ఇప్పటికే ఒకసారి తమ బృందం భగీరధను పరిశీలించి వెళ్లిందన్నారు. మిషన్ భగీరథ డిజైన్, పనులు జరిగిన తీరులోనే తమ ప్రాజెక్ట్ కూడా ఉంటుందన్నారు. ఈ పర్యటనలో భగీరథ chief ఇంజినీర్లు విజయ్ ప్రకాష్, శ్రీనివాస్ రెడ్డి, ఈఈ నరేందర్, కన్సల్టెంట్ జగన్ తో పాటు ఇతర అధికారులు ఉన్నారు.

- Advertisement -