తిక్క మూవీ రివ్యూ

856
- Advertisement -

ఈ మధ్య వరుస విజయాలతో తన జోరు చూపిస్తున్నాడు సాయిధరమ్‌ తేజ్‌. ‘పిల్లా నువ్వు లేని జీవితం’.. ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’.. ‘సుప్రీమ్‌’లతో హ్యాట్రిక్‌ సాధించాడు. దాంతో తేజూ సినిమా అంటే అంచనాలు పెరుగుతున్నాయి. తొలి సినిమా ‘ఓం’తో ఓ విఫల ప్రయత్నం చేసిన సునీల్‌రెడ్డికి తేజూ అవకాశం ఇచ్చాడంటే.. నిజంగా కథలో ఏదో దమ్ము ఉందనిపిస్తుంది. తేజూ నమ్మకాన్ని సునీల్‌రెడ్డి నిలబెట్టాడా? లేదా?…

కథ :

ఆదిత్య (సాయిధరమ్‌ తేజ్‌) సరదా కుర్రాడు. మందు.. అమ్మాయిలు.. వాళ్లతో ప్రేమ వ్యవహారాలూ.. ఇదే జీవితం అనుకొంటాడు. కానీ.. అంజలి (లరిస్సా బోన్సి) వచ్చాక అతని జీవితం మారిపోతుంది. న్ని చెడు వ్యసనాలకూ దూరంగా ఉంటాడు. తనకు ప్రాణమైన నాన్న (రాజేంద్రప్రసాద్‌)కీ దూరమవుతాడు. అయితే సడన్‌గా ఓ రోజు సిల్లీ కారణాలు సాకుగా చూపించి బ్రేకప్‌ చెప్పేసి వెళ్లిపోతుంది అంజలి. వెళ్తూ.. వెళ్తూ ఓ ఉత్తరం ఆదిత్య జేబులో పెట్టి వెళుతుంది. అంజలి దూరమైందన్న బాధతో స్నేహితులతో కలసి చిత్తుగా మందు తాగేస్తాడు ఆదిత్య. ఆ ప్రభావంతో చేసిన హంగామా ఏమిటి? దాని వల్ల ఎలాంటి పర్యవసానాలు ఎదురయ్యాయి? అంజలి దూరం కావటానికి కారణం ఏమిటి? అసలా ఉత్తరంలో ఏముంది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే నిస్సందేహంగా సాయిధరమ్ తేజ్ అనే చెప్పాలి. చాలా నీరసంగా నడిచే కథను కూడా తన ఎనర్జిటిక్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీతో నడిపించగలిగాడు. ముఖ్యంగా ఏడుస్తూ కూడా కథ అవసరానికి తగ్గట్టు నవ్వించేలా చేయడంలో సాయిధరమ్ తేజ్ బాగా మెప్పించాడు. ఇక అజయ్, అతడి గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే కన్ఫ్యూజన్ కామెడీ బాగుంది. కమెడియన్ సత్యకు రాసిన స్టీఫెన్ అనే క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆ పాత్రలో సత్య మంచి టైమింగ్‌తో నవ్వించాడు.

సినిమా పరంగా చూసుకుంటే సెకండాఫ్‌ను ఉన్నంతలో మేజర్ హైలైట్‌గా చెప్పుకోవాలి. కథంతా చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ చుట్టూ తిరుగుతూ ఉండే సెకండాఫ్ అక్కడక్కడా నవ్వించేలా ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. తిక్క తిక్క అనే పాట కూడా బాగా ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు కథనమే అతిపెద్ద మైనస్ పాయింట్. ఒక కామెడీ సినిమాకు సరిపడే స్థాయి కన్ఫ్యూజన్‌ను పెట్టుకొని కూడా దాన్ని సరైన రీతిలో చెప్పలేకపోవడంతో సినిమా అంతా నీరసంగా సాగిపోయింది. ఫస్టాఫ్ అయితే పూర్తిగా లౌడ్ కామెడీతో నడుస్తూ చాలా చోట్ల విసుగు పుట్టించింది. హీరోయిన్లు లారిస్సా బొనెసి, మన్నారా చోప్రాలు సినిమాకు పెద్దగా ఉపయోగపడింది లేదు. మన్నారా చోప్రా పాత్ర అయితే చాలా సిల్లీగా ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ మినహాయిస్తే ఫస్టాఫ్‌లో ఒక్క ఎగ్జైటింగ్ ఎలిమెంట్ కూడా లేదు. సినిమా మొత్తంలో ఎక్కడ వెతికినా, ఎమోషన్, లాజిక్ అన్నవి కనిపించవు.

సాంకేతిక విభాగం :

‘తిక్క’లో మెచ్చుకోతగ్గ అంశం ఏదైనా ఉంటే పాటలు, వాటి చిత్రీకరణ మాత్రమే. ‘తిక్క తిక్క తిక్కగున్నదే’, ‘హాట్‌ షాట్‌ హీరో’, ‘వెళ్లిపోకే’ సాంగ్స్‌ వినడానికి, చూడ్డానికి కూడా బాగున్నాయి. ఈ కథకి, ఈ సిట్యువేషన్స్‌కి తమన్‌ ఇంతగా ఇన్‌స్పయిర్‌ అయి, ఇంత మంచి మ్యూజిక్‌ ఇవ్వడం గొప్ప విషయమే. బహుశా సునీల్‌ రెడ్డి తెరపై తీసే దానికంటే కథ బాగా చెప్తాడేమో మరి. అతడిని నమ్మి కళ్యాణ్‌రామ్‌ అప్పుడు కోట్లు కుమ్మరిస్తే, ఇప్పుడు ఫామ్‌లో ఉన్న సాయిధరమ్‌ తేజ్‌ మిగిలిన అన్ని ప్రాజెక్టుల కంటే ముందు దీనిని ఫినిష్‌ చేసాడంటే కారణం అదే అనుకోవాలి. ఎడిటర్‌ని మెచ్చుకుని తీరాలి. తెరపై ఏం జరుగుతుందనే గందరగోళం కన్సిస్టెంట్‌గా మెయింటైన్‌ చేసిన సినిమాని ఎడిట్‌ చేయడమంటే మాటలు కాదు మరి. ఓం 3డిని బీట్‌ చేసే తిక్క తీయగలిగిన సునీల్‌ రెడ్డికి మళ్లీ దీనిని బీట్‌ చేసే సినిమా తీయడం మాత్రం అంత తేలిక కాదనే చెప్పాలి.   కె.వి.గుహన్‌కు ఎక్కువ మార్కులు ఇవ్వొచ్చు. ఎక్కువగా రాత్రిపూటే జరిగే కథకు తగ్గ లైటింగ్‌ను, సినిమా చెప్పాలనుకున్న అంశానికి తగ్గ ఫ్రేమింగ్‌ను వాడుతూ గుహన్ మంచి ప్రతిభ చూపాడు.

తీర్పు :

హ్యాంగోవర్‌లో ఓ కుర్రాడు.. అతని స్నేహితులు కలసి చేసిన నిర్వాకమే ఈ చిత్రం. దానికి కాస్తంత కన్‌ఫ్యూజన్‌ డ్రామా మిక్స్‌ చేసుకొన్నారు. కథ వింటుంటే.. ‘లైన్‌ ఏదో బాగానే ఉందిలే’ అనిపిస్తుంది. దాన్ని ఇంకా బాగా తీయాలంటే సన్నివేశాలు బాగా రాసుకోవాలి. పాత్రల మధ్య సంఘర్షణ పండాలి. వినోదం తోడవ్వాలి. అయితే.. ‘తిక్క’లో అవన్నీ లోపాలుగానే కనిపిస్తాయి. సినిమా మొదలైన పది నిమిషాలకే.. గాడి తప్పినట్లుగా కనిపిస్తుంది. కారణం కథ.. కథనం రెండూ గజిబిజిగా ఉండడమే.

ఓవరాల్ గా తిక్క’ భరించాలంటే సహనం అవసరం.

విడుదల తేదీ : ఆగష్టు 13, 2016

రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : సునీల్ కుమార్ రెడ్డి

నిర్మాత : సి. రోహిణ్ రెడ్డి

సంగీతం : ఎస్.ఎస్. థమన్

నటీనటులు : సాయిధరమ్ తేజ్, లారిస్సా బొనెసి, మన్నారా చోప్రా..

- Advertisement -