విద్యన్నకు.. కన్నీటి వీడ్కోలు

252
state-funeral-vidyasagar-rao
- Advertisement -

నీటిపారుదల రంగ నిపుణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆర్. విద్యాసాగర్‌రావు అంత్యక్రియలు ముగిసాయి.  గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విద్యాసాగర్‌రావు (77) అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అంత్యక్రియలు అంబర్‌పేటలోని శ్మశానవాటికలో పూర్తయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. మంత్రులు తలసాని శ్రీనివాసరావు, హరీశ్‌రావు, ఎంపీలు మల్లారెడ్డి, బూర నర్సయ్యగౌడ్‌, ప్రజా గాయకుడు గద్దర్‌, అల్లం నారాయణ, వరవరరావు తదితరులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. విద్యాసాగర్‌రావు తెలంగాణకు చేసిన సేవలు మరువలేనివని గద్దర్‌ అన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నీళ్ల గురించి నిరంతరం తపనపడిన వ్యక్తి విద్యసాగర్‌ రావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో.. రాష్ట్ర సాధనలో కేసీఆర్‌, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌తో కలిసి పనిచేసిన ఆయన సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై సదస్సులు నిర్వహించి, కచ్చితమైన సమాచారం, వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపరిచారు.

vidya-sagar-rao-2

సాగునీటి రంగంలో తెలంగాణ ఏవిధంగా ముందుకెళ్లాలన్న విషయమై సలహాలు ఇచ్చి దార్శనికుడిగా వ్యవహరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక, పర్యావరణ అంశాలను ఎత్తి చూపించారు. తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడిగా వ్యవహరించారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సాగునీటి రంగంలో ఆయన అనుభవం దృష్ట్యా విద్యాసాగర్‌రావును సాగునీటి సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన పలు ప్రాజెక్టులకు ఆయన సాంకేతికసేవలు అందించారు. కాంగ్రెస్‌, తెదేపా ప్రభుత్వాల హయాంలో మంజూరు చేసిన ప్రాజెక్టుల పునరాకృతి సమయంలో ప్రతిపక్షాల ఆరోపణలకు ఆయనే స్వయంగా సమాధానమిచ్చారు. సాగునీటి రంగానికి సంబంధించి లోతైన విశ్లేషణలు చేయడంలో విద్యాసాగర్‌రావు దిట్ట.

-1960లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్ పట్టా
-తొలినాళ్లలో జూనియర్ ఇంజినీర్‌గా విధులు
-1979లో రూర్కీలోని జలవనరుల అభివృద్ధి వర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ
-1983లో అమెరికాలోని కొలరాడో స్టేట్ వర్సిటీ నుంచి డిప్లొమా
-1990లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా
-కేంద్రం జలసంఘంలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తింపు
-ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమానికి సలహాదారుగా విధులు
-కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి రావాల్సిన వాటా కోసం పోరు
-పోలవరం, కంతనపల్లి తదితర అంశాలపై పలు వేదికలపై ఉపన్యాసాలు
-శ్రీకృష్ణ కమిటీకి అందించే నివేదిక రూపకల్పన సమయంలో కీలకపాత్ర
-జలసంబంధ అంశాలకు సంబంధించి పలు వార్తాపత్రికల్లో వ్యాసాలు
-వ్యాసాలన్నింటినీ కలిపి నీళ్లు – నిజాలు పేరిట రెండు సంకలనాల ముద్రణ
-రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ సలహాదారుగా నియమించిన సీఎం కేసీఆర్

- Advertisement -