మోడీని ముంచుతున్న నోట్లరద్దు,జీఎస్టీ..!

362
Note Ban -GST hits Modi
- Advertisement -

స్ధానిక ఎన్నికల్లో వ‌రుస విజ‌యాల‌తో ఉపుమీదున్న కాంగ్రెస్‌తో బీజేపీ బెంబేలెత్తుతోంది. గుజరాత్‌లో సుడిగాలి పర్యటన చేస్తున్న మోడీకి అక్కడి ఫలితాలపై ఉన్న అనుమానం కారణంగానే అక్కడ ఎన్నికలు ప్రకటించలేదు. బీజేపీ ఒత్తిడి మేరకే గుజరాత్‌లో ఎన్నికలు ప్రకటించలేదని ఇప్పటికే దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది. గుజారత్ ఓడితే వచ్చే సాధారణ ఎన్నికల్లో మోడీ,షా ఓటమిపాలు కాక తప్పదు.

బీజేపీ ఓటమికి ప్రధాన కారణం నోట్ల రద్దు,జీఎస్టీ ఎఫెక్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సంవత్సరం క్రితం నల్లధనాన్ని వెలికితీస్తామనే పేరుతో ప్రజలందరిని క్యూలో నిలబెట్టారు..కారణాలు బహు భారీగా చూపెట్టారు.. తర్వాత జరిగిన ప్రతీఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో ప్రజలంతా నోట్లరద్దు, జీఎస్టీని ఆమోదించారని బల్లగుద్దారు కానీ సరిగ్గా ఏడాది తర్వాత సీన్‌ రివర్సైంది.

ఓ వైపు నోట్ల రద్దు ఎఫెక్ట్‌తో సామాన్యుడిపై పెనుభారం పడగా క్షేత్రస్ధాయిలో జీఎస్టీ అమలవుతుంటే అంతా అయోమయానికి గురవుతున్నారు.  నోట్ల రద్దుతో జరిగిన లాభం ఏంటో చెప్పలేని స్ధితిలో బీజేపీ ఉండిపోయింది. చివరికి జీఎస్టీకి  మద్దతిచ్చిన ముఖ్యమంత్రులే ఇప్పుడు రివర్సవుతున్నారు.  ముఖ్యంగా బీజేపీకి అండగా ఉన్న వ్యాపారులు సైతం తిరగబడాల్సిన పరిస్ధితి వచ్చింది. ఫలితంగా దేశంలో  ఉప ఎన్నికలు జరుగుతున్న ప్రతిచోట కాషాయ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.

ప్రస్తుతం ట్రెండ్‌ని చూస్తే సంపన్న వర్గాలు,సోషల్‌ మీడియా వర్గాలు మోడీకి దూరమవుతున్నట్టు తెటతెల్లమవుతోంది. ఈ ట్రెండ్ కొనసాగితే మోడీ,షా జోడి తాము చేసిన తప్పులకు మూల్యం చెల్లించక తప్పదనే చెప్పాలి.  ఈ పరిణామాలన్ని అడ్వాంటేజ్‌ రాహుల్‌గా మారుతున్నాయి. ఈ నెలాఖరుకి కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టనున్న రాహుల్‌కి అప్పుడే దీపావళి వచ్చినట్టుగా పరిస్ధితులు అనుకూలిస్తున్నాయి.

అందుకే  ఏ విషయంలోనూ అతి పనికి రాదంటారు. స్వచ్ఛ్ భారత్ పేరిట,నల్లధనం పేరిట,అవినీతి పేరిట,బందు ప్రీతి పేరిట,కుటుంబపాలన పేరిట బీజేపీ అతిగా చేస్తోన్న ప్రచారం అసలుకే మోసాన్ని తెస్తోంది.

దీనికి నిదర్శనం….ఇటీవల మహారాష్ట్రలోని నాందేడ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు. కాంగ్రెస్‌కు భారీ విజయాన్ని కట్టబెట్టిన అక్కడి ప్రజలు బీజేపీని సింగిల్‌ డిజిట్‌కే పరిమితం చేశారు.  ఇక బీజేపీకి పట్టున్న గురుదాస్‌ పూర్‌లో ఆపార్టీకి చేదు అనుభవమే మిగిలింది. దాదాపు రెండు లక్షల భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్ధిపై కాంగ్రెస్ గెలుపొంది. కేరళలో ఓ అసెంబ్లీకి ఉప ఎన్నికల్లో సైతం బీజేపీకి పరాభవం తప్పలేదు. బీజేపీ అభ్యర్ధికి కేవలం 5వేల ఓట్లు మాత్రమే రాగా ఇక్కడ కూడా కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ ఎన్నికలు మోడీ సర్కార్‌కి సెమీఫైనల్‌గా మారనున్నాయి. ముఖ్యంగా గుజరాత్‌ మోడీ సొంత రాష్ట్రం కావడంతో బీజేపీ అధికారంలోకి రావడం ఆయన ప్రతిష్టకు పరీక్షగా మారనుంది.

- Advertisement -