‘పప్పు’పై ఈసీ నిషేధం

261
No Pappu please
- Advertisement -

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ప్రత్యర్థి పార్టీలు విమర్శించిన సమయంలో ‘పప్పు’ అనే పదం వాడటం వారికి పరిపాటిగా మారింది. అయితే, తాజాగా, రాహుల్‌ను ఉద్దేశించి ప్రచార కార్యక్రమాల్లో ‘పప్పు’ అనే పదాన్ని వినియోగించడాన్ని గుజరాత్‌ ఎన్నికల కమిషన్‌ నిషేధించింది.

బీజేపీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీని ఉద్దేశించి పప్పు అన్న పదాన్ని ఉపయోగించడంపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును పరిగణనలోనికి తీసుకున్న గుజరాత్ ఎన్నికల కమిషన్ పప్పు అన్న పిలుపు అభ్యంతరకరంగా ఉందని పేర్కొంటూ ఎన్నికల ప్రచారంలో ఈ పదాన్ని ఉపయోగించడాన్ని నిషేధించింది.

ఓ నాయకుడిని అలా పిలవడం ఆయన్ను అవమానించడమేనని ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. ఎన్నికల కమిషన్‌ నిర్ణయంపై స్పందించిన గుజరాత్‌ బీజేపీ శ్రేణులు అడ్వర్టైస్‌మెంట్‌లో వినియోగించిన స్క్రిప్ట్‌ ఏ నాయకుడిని ఉద్దేశించి కాదని పేర్కొన్నాయి.

ఎన్నికలకు ముందు ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన స్క్రిప్టును ముందుగానే గుజరాత్‌ ఎన్నికల కమిషనర్‌ ఆధ్వర్యంలో ఉండే మీడియా కమిటీకి అందజేస్తామని తెలిపాయి. అలా స్క్రిప్టును పరిశీలించిన కమిటీ సభ్యులు ‘పప్పు’  అనే పదాన్ని తొలగించాలని కోరినట్లు వెల్లడించాయి. త్వరలోనే సరికొత్త స్క్రిప్టును ఈసీకి అందజేస్తామని తెలిపాయి.

- Advertisement -