హీరోలు కలిసుంటేనే.. పరిశ్రమకు బలం

293
- Advertisement -

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ వక్కంతం వంశీ దర్శకుడు. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సందర్భంగా నాగబాబు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. సినిమా, తన కెరీర్‌ విశేషాలను పంచుకున్నారు.

Nagababu remembers Orange

‘హీరోలు కలిసుంటేనే.. పరిశ్రమ బలంగా ఉంటుంది’ అని అంటున్నారు నటుడు, నిర్మాత నాగబాబు. ‘‘ఆరెంజ్’ సినిమా పరాజయం తర్వాత ఒక నిర్మాతగా నేను సరిపోను అనిపించింది. నష్టం వచ్చిందనే బాధకంటే ‘మగధీర’లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్‌చరణ్‌కు మంచి హిట్ ఇవ్వలేకపోయానన్న బాధ ఎక్కువగా ఉండేది. అందుకే ఆ తర్వాత సినిమా నిర్మాణానికి చాలా దూరంగా ఉంటూ.. సీరియల్స్, స్పెషల్ షోస్ చేస్తూ ఉన్నాను. ‘జబర్దస్త్’తో నా కెరీర్‌లో ఊహించని మార్పులొచ్చాయి. నా కెరీర్‌లో ఇది బెస్ట్ ఫేజ్ అని చెప్పొచ్చు. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకొంటున్నాను’’.

Nagababu remembers Orange

‘‘అల్లు అరవింద్, అల్లు అర్జున్ నన్ను మళ్ళీ నిర్మాతగా మారమని ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టారు. ఒక సమర్పకుడిగా కేవలం ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వహించాను. కథ, దర్శకుడు అనేవి అన్నీ వారే ఎంపిక చేసుకొన్నారు. నిజానికి నిర్మాతలంటే రోజూ సెట్స్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. పెద్ద హీరోల సినిమాలంటే అన్నీ ఒక ప్లాన్ ప్రకారం జరిగిపోతుంటాయి. నేను అప్పుడప్పుడూ సెట్‌కు వెళ్లా అంతే. అంతా బన్నీ వాసు దగ్గరుండి చూసుకున్నాడు. సినిమాలో ఎలాంటి ఆర్టిస్ట్ కావాలి అనే దగ్గర నుంచి అన్నీ తానే చూసుకున్నాడు’’.

‘ఈ మధ్య ఎన్టీఆర్‌, మహేశ్‌ బాబు, రామ్ చరణ్ కలిసి పార్టీలకు వెళ్ళడం, అక్కడ ఫొటోలు దిగడం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారంతా కలిసుంటేనే చిత్ర పరిశ్రమ బాగుంటుంది. అందువల్ల ఈ పరిణామం పరిశ్రమకి మంచిదనే చెప్పాలి. హీరోలు కలిసుంటేనే.. పరిశ్రమ బలంగా ఉంటుంది’. అన్నారు.

- Advertisement -