ధూం ధాంగా తెలంగాణ అవతరణం..

296
telangana formation day
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర 4వ అవతరణ దినోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని 31 జిల్లాలతో పాటు ఢిల్లీ,లండన్,ఆస్ట్రేలియా,న్యూజిలాండ్,దుబాయ్‌లో తెలంగాణ అవతరణ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు రూ. 2 లక్షలు కేటాయించారు.

తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా మండల, జిల్లాస్థాయిల్లో కళాకారులు, కవులు, వివిధ రంగాల్లో నిపుణులకు పురస్కారాలు అందజేయనున్నారు. రవీంద్రభారతి వేదికగా వీరందరిని ఘనంగా సత్కరించనున్నారు. శుక్రవారం నుంచి నాలుగురోజులపాటు నగర ప్రజలను ఉత్సాహపరుస్తూ ఉద్యమకాల స్మృతులను గుర్తుచేసేందుకు సాంస్కృతిక వేడుకలు నిర్వహించనున్నారు. రవీంద్రభారతిలో శుక్రవారం నుంచి నాలుగురోజులపాటు నిత్యం సాయంత్రం 5 గంటలకు ఫిల్మోత్సవం నిర్వహిస్తారు. ఉత్తమ లఘుచిత్రాలకు ఈ నెల 5న అవార్డులు ప్రదానం చేస్తారు. మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆల్ ఇండియా ఆర్ట్ కాంపిటీషన్ 2018 నిర్వహించనున్నారు.

Image result for telangana formation day

రాష్ట్ర అవతరణ సందర్భంగా ప్రజలకు పర్యాటకశాఖ విహంగయాన (స్కై రైడ్) సదుపాయం కల్పిస్తున్నదని పర్యాటకశాఖ కార్యదర్శి బీ వెంకటేశం తెలిపారు. పారా మోటరింగ్‌గా పిలిచే ఈ సదుపాయాన్ని జూన్ 2 నుంచి మూడు రోజుల పాటు బైసన్‌పోలో మైదానంలో కల్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

పీపుల్స్ ప్లాజాలో శుక్రవారం నుంచి ఈ నెల 5 వరకు తెలంగాణ ధూంధాం నిర్వహిస్తారు. ఘుమఘుమలాడే తెలంగాణ వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటుచేశారు. 3వ తేదీన సాయంత్రం 5 గంటలకు వేయిమంది కళాకారులు లుంబినిపార్క్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు కళాయాత్ర నిర్వహిస్తారని తెలిపారు. చిందుయక్షగానం, ఒగ్గుడోలు, చిరుతల రామాయణం కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ప్రతీ గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.

- Advertisement -