యంగ్ టైగర్‌తో ‘దర్శకుడు’ టీజర్..

291
Darshakudu Movie Teaser launch By Ntr
- Advertisement -

నా హృదయానికి బాగా దగ్గరైన వ్యక్తి సుకుమార్. ఆయన్ని బయటి వ్యక్తిగా నేనేప్పుడు చూడలేదు. సుకుమార్ రైటింగ్స్‌కు సంబంధించిన వేడుకకు రావడం ఓ బాధ్యతగా, ప్రేమగానే భావిస్తాను అని అన్నారు ప్రముఖ హీరో ఎన్టీఆర్. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు సుకుమార్, బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి నిర్మిస్తున్న చిత్రం దర్శకుడు. అశోక్, ఈషా జంటగా నటిస్తున్నారు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో హీరో ఎన్టీఆర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్శకుడి ప్రేమకథను తెరపై చూపించడమనే యూనిక్ కాన్సెప్ట్‌తో హరిప్రసాద్ సినిమాను తెరకెక్కించడం ఆనందంగా ఉంది. కథకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే దర్శకుల్లో సుకుమార్ ఒకరు. సుకుమార్ రైటింగ్స్ ద్వారా కొత్త కథలను, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులను చిత్రసీమకు పరిచయం చేయడం సుకుమార్ గొప్పతనానికి నిదర్శనంగా చెప్పవచ్చు దర్శకుడు చిత్ర టీజర్ బాగుంది. సినిమా విజయవంతం కావాలి అన్నారు.

Darshakudu Movie Teaser launch By Ntr

సుకుమార్ మాట్లాడుతూ.. కుమారి 21ఎఫ్ అనే చిన్న సినిమాను మూదు పదాల ట్వీట్‌తో సూపర్‌హిట్ చేశారు ఎన్టీఆర్ అలాంటి సహృదయత చాలా తక్కువ మందికి ఉంటుంది నాన్నకు ప్రేమతో నుంచి మా అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయడానికి ఎలాంటి సంశయాలు లేకుండా అతడి దగ్గరకు వెళ్లగానే ఎన్టీఆర్ స్వయంగా నేను వస్తున్నాను అని అన్నారు. ఆయన ప్రేమకు పాత్రుడినైనందుకు అదృష్టంగా భావిస్తున్నాను. కొందరితో మాట్లాడితే ఆత్మలతో సంభాషించినట్లు ఉంటుంది. వారిలోని కోపం, నవ్వు సులభంగా తెలిసిపోతాయి. అలాగే తారక్ నవ్వు వెనుక సముద్రమంతా ప్రేమ ఉంటుంది. అతడి కోపం వెనుక చిన్నపాటి ఆవేశం ఉంటుంది. నా బ్యానర్‌లో ప్రతి సినిమాకు అతడు రావడం ఆనవాయితీగా మారాలని కోరుకుంటున్నాను(నవ్వుతూ). కుమారి 21ఎఫ్ తర్వాత చాలా కథలు విన్నాను. కానీ ఏది నచ్చలేదు. హరిప్రసాద్ చెప్పిన కథ మాత్రం నన్ను బాగా ఆకట్టుకుంది.

Darshakudu Movie Teaser launch By Ntr

వన్ నేనొక్కడినే మూల కథ అతడిదే. నేను దానిని డెవలప్ చేశానంతే. అతడి తెలివితేటలపై నమ్మకంతో ఒక్కరోజు కూడా నేను సెట్స్‌కు వెళ్లలేదు. సినిమా చాలా బాగా వచ్చింది. తపనకు, ప్రేమకు మధ్యకు నలిగిపోయే ఓ దర్శకుడి ప్రేమకథ ఇది. స్వార్థపరుడైన దర్శకుడు ప్రేమలో పడితే ఏం జరుగుతుందనేది ఆసక్తిని పంచుతుంది అని అన్నారు. కథానుగుణంగా ఓ దర్శకుడు సెట్స్‌లో ఎలా ఉంటాడో, బయటి అతడి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవడం అవసరమైందని, దాంతో నాకు తెలిసిన దర్శకుడు సుకుమార్ బాడీలాంగ్వేజ్‌ను దృష్టిలోపెట్టుకొని హీరో పాత్రను తీర్చిదిద్దానని హరిప్రసాద్ చెప్పారు. కుమారి 21ఎఫ్‌కు మించి ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముందని నిర్మాత విజయ్‌కుమార్ తెలిపారు. సుకుమార్‌తో కలిసి సినిమా చేయాలనే తన కల దర్శకుడు చిత్రంతో నెరవేరిందని సంగీత దర్శకుడు సాయికార్తీక్ చెప్పారు. ఈ చిత్రంలో నమ్రత అనే అమ్మాయిగా అభినయానికి ఆస్కారమున్న పాత్రను పోషించానని ఈషా చెప్పింది.

ఈ కార్యక్రమంలో బి.ఎన్.సి.ఎస్. పి. విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర, అనుమోలు ప్రవీణ్, ఇషా, పూజిత, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, చెర్రీ, రామ్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అనుమోలు ప్రవీణ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్ కోలా.

- Advertisement -