గోదావరి బోటు ప్రమాదం..30 మంది గల్లంతు..!

261
Boat Tragedy in AP -30 missing?
- Advertisement -

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు సమీపంలో గోదావరి నదిలో మంగళవారం సాయంత్రం లాంచీ మునిగిపోయిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు భారీ క్రేన్ల సహాయంతో పడవను ఒడ్డుకు చేర్చారు. నిన్న సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ భారీ వర్షం, గాలుల ధాటికి నీట మునిగింది. ఈ ప్రమాదంలో 30మందికి పైగా గల్లంతయ్యారు.

పడవ ఏకంగా 60 అడుగుల లోతులో ఇసుకలో కూరుకుని ఉండిపోవడంతో దాన్ని బయటకు తెచ్చేందుకు ఉదయం నుంచీ తీవ్రంగా శ్రమించారు. మృతదేహాలు కూడా పడవలోనే చిక్కుకుని ఉండిపోవడంతో సహాయ బృందాలకు సవాల్‌గా మారింది. ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను ఒడ్డుకు చేర్చి, అక్కడే పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించేలా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రమాదంలో ఎంత మంది చనిపోయారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

లాంచీ ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. గాలింపుతో పాటు సహయక చర్యల గురించి బాబు ఆరా తీశారు. గాలింపును ముమ్మరం చేయాలని బాబు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సహా అధికారులు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

పడవ ప్రమాదంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రమాదాలు నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పడవ ప్రమాదం విచారణను సాగదీస్తున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదని జగన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

వారంలో ఇది రెండో బోటు ప్రమాదం కావటం చర్చనీయాంశంగా మారింది. దేవీపట్నం సమీపంలోనే వారం రోజుల క్రితం పాపికొండల టూర్ కు వెళ్తున్న లాంచీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో సుమారు 80 మంది పర్యాటకులున్నారు. అయితే ఆ సమయంలో లాంచీ డ్రైవర్ లాంచీని గోదావరి ఒడ్డుకు తీసుకొచ్చి నిలిపివేశారు. పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటన జరిగి వారం రోజులు గడవకముందే ఇదే ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.

- Advertisement -