అదృష్టవంతురాల్ని..చావుని జయించా

248
Almost died says Serena
- Advertisement -

సమర్థ వైద్యం అందుబాటులో ఉండబట్టే నేను బతికి బట్టకట్టా… మరి దానికి నోచుకోని సామాన్యులను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరికీ లేదా అంటూ తన మనసులోని మాటని బయటపెట్టింది టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్. గత సెప్టెంబర్‌లో సెరెనా…కూతురుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన మనసులోని మాటలను సీఎన్‌ఎన్‌కు ప్రత్యేక లేఖ రూపంలో వివరించింది.

నా బంగారు కూతురు ఒలింపియాకు జన్మనిచ్చిన తర్వాత నేను దాదాపుగా మృత్యువు ఒడిలోకి వెళ్లిపోయా..కానీ నేను ఎంతో అదృష్టవంతురాలిని. అందుకే బయటపడ్డా అంటూ తాను కాన్పు సమయంలో ఎదుర్కొన్న సమస్యలను వివరించింది. గర్భం దాల్చిన తర్వాత రోజులన్నీ ఎంతో ఆహ్లాదంగా గడిచిపోయాయి. అనుకున్నట్టే నొప్పులు మొదలయ్యాయి. కానీ బిడ్డ గుండె కొట్టుకునే వేగం బాగా తగ్గిపోతుంటే వైద్యులు అత్యవసరంగా సిజేరియన్‌ చేసి బిడ్డను బయటకు తీశారు. ఆ సర్జరీ సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందీ లేదు. నాకు తెలివి వచ్చే సరికే ఒలింపియా నా చేతుల్లో ఉంది. నా జీవితంలో మరువలేని అద్భుత అనుభూతి అది. కానీ పాప పుట్టిన 24 గంటల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్కడి నుంచీ దాదాపు 6 రోజుల పాటు నేను ఏమవుతానో తెలియని పరిస్థితి!’’ అంటూ ఆమె హఠాత్తుగా తలెత్తిన సమస్యలను వివరించారు.

Almost died says Serena

నేను బతికి ఉండటమే అదృష్టం. ఉన్నట్టుండి తీవ్రమైన దగ్గు మొదలైంది. దాని ధాటికి కుట్లు పిగిలిపోయి, ఆపరేషన్‌ చేసిన చోట గాయం తెరుచుకుపోయింది. దగ్గు మొదలవుతూనే నాకు అనుమానం వచ్చింది.. ఆపరేషన్‌ కారణంగా గాయం దగ్గర రక్తం గడ్డకట్టి.. అది ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయిందేమోనని! దాన్నే ‘పల్మనరీ ఎంబోలిజం’ అంటారు. నాకీ అనుమానం వస్తూనే క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా నర్సుల దృష్టికి తీసుకువెళ్లా. వైద్యులు పరీక్షించి చూస్తే పొట్టలో రక్తం గడ్డకట్టి పెద్ద ముద్దలా ఏర్పడిందని తేలింది. నన్ను మళ్లీ ఆపరేషన్‌ థియేటర్లోకి తీసుకువెళ్లారు. ఆ రక్తం గడ్డ ఊపిరితిత్తుల్లోకి పోకుండా అడ్డుకునేందుకు పెద్ద చికిత్సే చేశారు. తర్వాత కూడా రోజుల తరబడి ఎంతో అయోమయం. చివరికి ఎప్పుడో ఇంటికి చేరాను. ఇలా మాతృత్వపు మధురిమలను ఆస్వాదించాల్సిన మొదటి ఆరు వారాలూ ఆసుపత్రుల్లోనూ, బెడ్‌ మీదే కరిగిపోయాయి’’ అంటూ ఆమె ప్రాణం కోసం పోరాడిన ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.

ఇంత జరిగినా తాను ఎంతో అదృష్టవంతురాలినని చెప్పుకోక తప్పదంటూ.. ‘‘అత్యాధునికమైన సదుపాయాలు, సమర్థ సిబ్బంది అందుబాటులో ఉండటం నేను చేసుకున్న అదృష్టం. వాళ్లే లేకపోతే నేనిలా మిగిలేదాన్ని కాదు.’’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నల్లజాతి మహిళలు ఎంతోమంది కాన్పు సమయంలో ఎదుర్కొంటున్న విపత్తుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా పేద దేశాల్లోని వేలాది మంది మహిళల దుస్థితి ఇదే. నాకు వచ్చిన లాంటి సమస్యలే వాళ్లకు ఎదురైతే వాళ్లను రక్షించే వైద్యులుగానీ, సదుపాయాలుగానీ.. ఏవీ ఉండటం లేదు. నొప్పులు పడుతూనే వాళ్లు మైళ్లకు మైళ్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఈ ప్రపంచంలోకి ఓ కొత్త నలుసును తెచ్చేలోపే వాళ్ల అధ్యాయం ముగిసిపోతోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లీపిల్లల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్న యునిసెఫ్‌ వంటి సంస్థలకు చేదోడుగా నిలబడండి. మనందరం కలిస్తే దీన్ని కచ్చితంగా సాధించగలం!’’ అంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకే కాదు.. ప్రతి ఒక్కరినీ ఆమె ప్రత్యేకంగా అభ్యర్థించారు.

- Advertisement -